
అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)
ఎల్నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో 43.4 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 66 శాతం విస్తీర్ణంలో పంటలు సాగైనా చివరి ఆయకట్టు భూములకు నీరందడం లేదు. వెద పద్ధతిలో సాగు చేసిన వరి పైరు వేల ఎకరాల్లో ఎండిపోయింది.
తీవ్రమైన కలుపు సమస్యతో పంటను రైతులు ట్రాక్టర్లతో దున్నేసి దమ్ము చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కరవు మండలాల ఎంపికపై వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 21 నాటికి నివేదిక రూపొందించి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నారు.
ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. వేమూరు, రేపల్లె, బాపట్ల నియోజకవర్గాల్లో 66 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ఇందులో చివరి ఆయకట్టులోని సుమారు ఆరు వేల హెక్టార్ల వరి పైరుకు నీరందక ఎండిపోయింది. కలుపు విపరీతంగా పెరగడంతో రెండు వేల హెక్టార్లలోని పైరును రైతులు దున్నేశారు. 37 వేల హెక్టార్లలో అసలు వరి సాగు కాలేదు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో ఆయకట్టు రైతులు వరి సాగుకు దూరమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ