
హైదరాబాద్ , 21 సెప్టెంబర్ (హి.స.)
మామ్నూర్ విమానాశ్రయం పునరుద్ధరణకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్న సమయంలోనే దాని పేరు చుట్టూ చర్చ ప్రారంభమైంది. వరంగల్ చరిత్ర, కాకతీయుల వారసత్వం, తెలంగాణ సామాజిక ఉద్యమాలు, ప్రముఖ నాయకుల సేవలను ప్రతిబింబించేలా పేరు ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పేరు పెట్టాలనే సూచన కూడా వచ్చింది. వరంగల్కు చెందిన ఆయన రాజకీయ ప్రస్థానం, ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ కొందరు ఈ పేరును ప్రతిపాదించారు.
మరోవైపు కాకతీయుల చరిత్రను ప్రతిబింబించే ‘కాకతీయ అంతర్జాతీయ విమానాశ్రయం’ అనే పేరు కూడా చర్చలో ఉంది.
రాణి రుద్రమదేవి పేరు కూడా పలువురి నుంచి వచ్చింది. వరంగల్ చరిత్రలో కాకతీయుల పాలనకు ఉన్న ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని ఆమె పేరును విమానాశ్రయానికి పెట్టాలని సూచనలు వచ్చాయి. దర్శకుడు సందీప్రెడ్డి వంగా కూడా రుద్రమదేవి లేదా కాకతీయుల పేర్లలో ఒకటి ఉండాలని సూచించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సమ్మక్క-సారలమ్మ పేరును సూచించగా, నిర్మాత బండ్ల గణేష్ రుద్రమదేవి పేరును ప్రస్తావించారు. ఈ చర్చలో మరో కోణం కూడా ఉంది. వరంగల్ కేవలం కాకతీయుల చరిత్రకు మాత్రమే కాకుండా తెలంగాణ సామాజిక, సాంస్కృతిక, ప్రజా ఉద్యమాలకు కూడా ముఖ్యమైన కేంద్రం. అందువల్ల విమానాశ్రయం పేరు నిర్ణయించేటప్పుడు ప్రాంతీయ చరిత్రకు విస్తృత ప్రాతినిధ్యం ఉండాలని కొందరు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్