
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
కృష్ణా నది నీటి కేటాయింపుల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం వల్లే నేడు రాష్ట్రంలో నీటి నిల్వలు లేక రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని వారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం సీఎల్పీ మీడియా సెంటర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ లాంటి కీలక ప్రాజెక్టులను రూ.8 వేల కోట్లతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రారంభించారని మంత్రి గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో కృష్ణా నీటిలో తెలంగాణ వాటా 30 శాతానికి మించలేదని, అయితే తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ వాటాను 43 శాతానికి పెంచి సాధించుకున్నామని స్పష్టం చేశారు. నీళ్లు పుష్కలంగా ఉన్న సమయంలో కూడా గత ప్రభుత్వం నీటిని వాడుకోలేకపోయిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..