
హైదరాబాద్ , 21 సెప్టెంబర్ (హి.స.)హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ తన నాలుగో భారత క్లౌడ్ రీజియన్ను అధికారికంగా ప్రారంభించింది. భారతదేశంలో డిజిటల్ మౌలిక వసతులు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించే దిశగా ఈ ప్రాజెక్టును కీలక అడుగుగా అధికారులు అభివర్ణించారు.
మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ‘ఇండియా సౌత్ సెంట్రల్’ క్లౌడ్ రీజియన్ ఇప్పటికే ఆగస్టు 6 నుంచి సాధారణ వినియోగానికి అందుబాటులోకి వచ్చినప్పటికీ, సోమవారం దీనికి సంబంధించిన అధికారిక కార్యక్రమం నిర్వహించారు. పుణే, చెన్నై, ముంబైలో ఉన్న క్లౌడ్ ప్రాంతాలకు ఇది అదనంగా చేరింది. భారత్లో డిజిటల్ మరియు ఏఐ మౌలిక వసతుల కోసం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలో హైదరాబాద్కు కూడా ప్రాధాన్యం లభించింది.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భవిష్యత్తులో డేటా సెంటర్లను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు దగ్గరగా ఏర్పాటు చేయడం ఆర్థికంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్