
హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తూ ప్రజల మద్దతు పొందుతుంటే 22ఏ అంటూ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్పై టీపీసీసీ సీనియర్ నేత రమ్యారావు మండిపడ్డారు.
పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం అడ్డగోలుగా దోచుకుందని విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘మాకు వందల ఎకరాలు ఉన్నాయని కేటీఆర్ అంటున్నారు.
సంతోష్ రావుకు 2013లో క్వారీలో 25 శాతం వాటా ఉండేదని, 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులో ముంపుకు గురైందంటూ సంతోష్ ఇంటి వాళ్లందరూ ఇళ్ల పట్టాలు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. కుదురుపాక గ్రామానికి సంబంధం లేని వారు కూడా ప్లాట్లు తీసుకున్నారని విమర్శించారు. కుదురుపాక గ్రామంలో ఒక్క సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు కలిసి 8 ప్లాట్లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ‘2018లో సంతోష్ రావుకు రాజ్యసభలో అవకాశం ఇచ్చారు. ఆ సందర్భంగా సంతోష్ ఒక్క ప్లాట్ను మాత్రమే అఫిడవిట్లో చూపించారు. 8 ప్లాట్లు తీసుకుని ఒక్క ప్లాటే ఎలా చూపించారు? 200 గజాల భూమిని కూడా వదలకుండా అడ్డగోలు అక్రమాలకు పాల్పడ్డారు. అంతేకాకుండా కుదురుపాక గ్రామంలో మెయిన్ రోడ్డులో బాధితుల భూములను అడ్డగోలుగా కొన్నాడు’ అని రమ్యా రావు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్