
ఢిల్లీ , 22 సెప్టెంబర్ (హి.స.)బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ మరింత బలపడుతున్న నేపథ్యంలో తూర్పు తీర రాష్ట్రాల్లో అప్రమత్తత పెరిగింది. ముఖ్యంగా ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు రానున్న రెండు మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాల ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 22న ఒడిశాలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకు అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు సుమారు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే తీరప్రాంత యంత్రాంగం అప్రమత్తమవుతోంది. తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు, రహదారి రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరించాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్