
ఢిల్లీ , 22 సెప్టెంబర్ (హి.స.)భారత వైమానిక దళం (IAF) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగే 'తరంగ్ శక్తి 2026' రెండవ విడత అంతర్జాతీయ వైమానిక విన్యాసాలకు రాజస్థాన్లోని జోధ్పూర్ వాయుసేన కేంద్రం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 12 వరకు కొనసాగే ఈ భారీ సైనిక విన్యాసాలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40కి పైగా దేశాలు భాగస్వామ్యమవుతుండగా, అనేక దేశాలు పరిశీలక హోదాలో పాల్గొంటున్నాయి.
ఈ విన్యాసాలలో ప్రధాన ఆకర్షణగా అమెరికాకు చెందిన ఐదో తరం అత్యాధునిక ఎఫ్-35 స్టీల్త్ ఫైటర్ జెట్లు నిలవనున్నాయి. భారత్లో జరుగుతున్న ఒక సైనిక విన్యాసంలో ఎఫ్-35 విమానాలు పాల్గొనడం ఇదే తొలిసారి. వీటితో పాటు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు, యుఏఈకి చెందిన ఎఫ్-16 జెట్లు గగనతలంలో తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించనున్నాయి. భారత వైమానిక దళం తరఫున స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్, సుఖోయ్-30 ఎమ్ కేఐ, రాఫెల్ యుద్ధ విమానాలతో పాటు నెత్రా విమానాలు ఈ విన్యాసాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. మిత్రదేశాల వాయుసేనల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడం, గగనతల యుద్ధ నైపుణ్యాలను పంచుకోవడమే ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్