
ఢిల్లీ , 30 సెప్టెంబర్ (హి.స.)జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదని మిగిలిచింది. సీవా హైడల్-II విద్యుత్ ప్రాజెక్టు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో CISFకు చెందిన అసిస్టెంట్ కమాండెంట్తో పాటు మరో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి CISF హెడ్ కానిస్టేబుల్ అవధేశ్ కుమార్ సింగ్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
మాష్కా గ్రామంలోని ప్రాజెక్టు ప్రాంతంలో సాయంత్రం సుమారు 6:40 గంటల సమయంలో ఘటన చోటుచేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుళ్లు సంజీవ్ కుమార్, మహ్మద్ రఫీక్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు తనకు కేటాయించిన AK-47 రైఫిల్తో కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నిందితుడు మరియు అతని భార్య ఇద్దరూ CISFలో పనిచేస్తున్నారు. వారు వేర్వేరు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుండటంతో చిన్నారిని ఒకరి నుంచి మరొకరికి అప్పగించే సందర్భాల్లో ప్రాజెక్టు ప్రాంగణానికి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని విధి నిర్వహణ ప్రాంతానికి తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ విషయంపై ఉన్నతాధికారులతో వాగ్వాదం జరగడం అనంతరం పరిస్థితి కాల్పులకు దారితీసినట్లు ప్రాథమిక సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్