జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల భారీ విజయం.. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ మూసా హతం
జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాల భారీ విజయం.. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ మూసా హతం
terrorist


కశ్మీర్ , 30 సెప్టెంబర్ (హి.స.)

కశ్మీర్ లోయలో ఉగ్రవాదులకు మరోసారి కోలుకోలేని దెబ్బ తగిలింది. భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టాప్ కమాండర్ మృతి చెందాడు. సెంట్రల్ కశ్మీర్‌‌లోని బద్గాం జిల్లాలో జరిగిన ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు అతన్ని మట్టుబెట్టాయి.

బద్గాం పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన యూస్‌మార్గ్ సమీపంలోని కోరాగ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి ఈ సంయుక్త ఆపరేషన్‌‌ను పక్కా సమాచారంతో అమలు చేశాయి. దూద్‌పత్రి దట్టమైన అడవుల్లో ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నాయి. లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ, ఉగ్రవాదులు సైనికులపైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అప్రమత్తమైన మన బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే కమాండర్ హతమయ్యాడు.

మృతి చెందిన ఉగ్రవాదిని సులేమాన్ షా అలియాస్ 'మూసా' (లేదా ఫౌజీ మూసా)గా అధికారులు గుర్తించారు. పిర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో గతంలో జరిగిన పలు హింసాత్మక ఘటనలు, ఉగ్రదాడుల వెనుక ఈ మూసానే ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఇతడి కోసం భద్రతా బలగాలు సుదీర్ఘకాలంగా వేటాడుతున్నాయి. గత నెల సెప్టెంబర్ 5న యూస్‌మార్గ్ కొండల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇతని సహచరుడు యాసిర్ హతమవ్వగా, మూసా మాత్రం అప్పట్లో చాకచక్యంగా తప్పించుకున్నాడు. నాటి నుంచి నిఘా పెంచిన భద్రతా బలగాలు, ఎట్టకేలకు ఈసారి పక్కా వ్యూహంతో అతడిని మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande