ముఖాముఖి: హల్ద్వానీలో జరిగిన 'శుద్ధీకరణ' ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్న కాంగ్రెస్: ఎంపీ డా. మల్లు రవి
తెలంగాణ నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ డా. మల్లు రవి 'హిందూస్థాన్ సమాచార్' ప్రత్యేక ముఖాముఖి
మల్లురవి


న్యూ దిల్లీ, సెప్టెంబర్ 30 (హి.స.): ఉత్తరాఖండ్ హల్ద్వానీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ తర్వాత రామ్‌లీలా మైదానంలో 'శుద్ధీకరణ యజ్ఞం' నిర్వహించిన వ్యవహారం తీవ్రరూపం దాల్చుతోంది. ఇది ఖర్గేను మాత్రమే కాకుండా, దళిత-ఆదివాసీ సమాజం ఆత్మగౌరపై జరిగిన దాడి అని కాంగ్రెస్ పేర్కొంది. దీనికి నిరసనగా కాంగ్రెస్ ఎస్సీ-ఎస్టీ ఫోరమ్ ఇక్కడ మావళంకర్ హాల్‌లో 'దళిత-ఆదివాసీ స్వాభిమాన సమావేశం' నిర్వహించి దేశవ్యాప్త ఆందోళనకు శ్రీకారం చుట్టింది.

ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న తెలంగాణ నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ డా. మల్లు రవి 'హిందూస్థాన్ సమాచార్' ప్రత్యేక ఇంటర్వ్యూలో హల్ద్వానీ ఘటన, రాహుల్ గాంధీపై నమోదైన కేసులు, 'ఒక దేశం, ఒక ఎన్నికలు', నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల సంఘం ఎస్ఐఆర్, కుల గణన తదితర వివిధ అంశాలపై పార్టీ వైఖరిని పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ ముఖ్యమైన భాగాలు ఇక్కడ ఉన్నాయి:

ప్రశ్న: హల్ద్వానీలో మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ తర్వాత జరిగిన 'శుద్ధీకరణ'పై మీ ఫిర్యాదుపై విచారణ మందగించింది దానికి విరుద్ధంగా రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. బెంగళూరులో జీరో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఈ పూర్తి విషయంలో ఇప్పటివరకు ఏం జరిగింది ముందు ముందు ఏం చేయనున్నారు?

జవాబు: లోక్‌‌సభ, రాజ్యసభ ఎస్సీ-ఎస్టీ ఎంపీలు సెప్టెంబర్ 7న ఇందిరాపురంలో సమావేశమై మల్లికార్జున ఖర్గే కార్యక్రమం అనంతరం జరిగిన శుద్ధీకరణపై చర్చించారు. ఇది ఖర్గేను మాత్రమే కాకుండా, మొత్తం ఎస్సీ-ఎస్టీ సమాజాన్ని అవమానించడమేనని ఎంపీలు పేర్కొన్నారు. దీనికి నిరసనగా సెప్టెంబర్ 8న దాదాపు 22 మంది ఎంపీలు పార్లమెంట్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు నిరాకరించారు. ఎంపీలు సుమారు మూడున్నర గంటల పాటు పోలీస్ స్టేషన్‌లో ధర్నాకు దిగారు. ఆ తర్వాత హల్ద్వానీలో అజ్ఞాత వ్యక్తులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో తమ ఫిర్యాదును చేరుస్తామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు నిష్పక్షపాత విచారణ జరగలేదని, దోషులపై చర్యలు తీసుకోలేదని మల్లు రవి ఆరోపించారు. రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రశ్న: నేటి నుంచి ప్రారంభమైన ఈ 'ఆత్మగౌరవ ఉద్యమం' క్షేత్రస్థాయి రూపరేఖలు ఏమిటి? ఇది కేవలం ప్రతీకాత్మక నిరసనలకే పరిమితమవుతుందా లేక క్షేత్రస్థాయిలో దళిత సమీకరణ, దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారుతుందా?

జవాబు: కాన్‌స్టిట్యూషన్ క్లబ్ మావళంకర్ హాల్‌లో నిర్వహించిన 'దళిత-ఆదివాసీ స్వాభిమాన సమావేశం'లో దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో హల్ద్వానీ ఘటనను ఖండిస్తూ, కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం ఆమోదించారు. అలాగే దళిత-ఆదివాసీ సమాజ హక్కుల పోరాటం కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కృతజ్ఞతా తీర్మానం కూడా ఆమోదించారు. ఈ ఉద్యమాన్ని దేశంలోని ప్రతి రాష్ట్రానికి విస్తరించి, స్థానిక ఎస్సీ-ఎస్టీ నాయకుల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తాం. నవంబర్ చివరి వారంలో దిల్లీ తాల్కటోరా స్టేడియంలో జాతీయ సదస్సును ప్రతిపాదించాము. ఇందులో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొనే అవకాశం ఉంది. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 'చదువుకోండి, సంఘటితమవ్వండి, పోరాడండి' నినాదం ఆధారంగా, శాంతియుత ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం కోసం ఈ పోరాటం సాగుతుంది.

ప్రశ్న: ఇది వ్యక్తిగత వ్యతిరేకత కాదని, రామ్‌లీలా మైదాన పవిత్రతకు సంబంధించిన స్థానిక విషయమని బీజేపీ, కొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ దీన్ని రాజకీయ అంశంగా మారుస్తోందని అంటున్నారు. దీనిపై మీ సమాధానం ఏమిటి?

జవాబు: ఇది అత్యంత దురదృష్టకరమైన వాదన. దిల్లీలో కూడా రామ్‌లీలా మైదానం ఉంది, అక్కడ కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సహా అన్ని పార్టీలు రాజకీయ సభలు నిర్వహిస్తాయి. అంత మాత్రాన అక్కడ కేవలం మతపరమైన అంశాలపైనే చర్చ జరుగుతుందని కాదు, అక్కడ ఎప్పుడూ రాజకీయ విషయాలపైనే చర్చలు జరుగుతూ వస్తున్నాయి. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత. ఆయన అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు, ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడారా? రామ్‌లీలా మైదానం అయినంత మాత్రాన ఏ దళిత లేదా వెనుకబడిన తరగతుల నాయకుడు అక్కడికి వెళ్లి మాట్లాడేందుకు అనుమతి లేదా? మిగతా నాయకులందరూ అక్కడ రాజకీయ ప్రసంగాలే చేస్తుంటారు కదా!

ప్రశ్న: రాజ్యసభలో అధికార పక్ష నేతలు ఈ ఘటనను ఖండించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ మీరెందుకు ఈ ఆందోళన చేయాల్సి వస్తోంది?

జవాబు: రాజ్యసభలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, సభా నాయకుడు జె.పి. నడ్డా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ సభలో ఇచ్చిన ఆ హామీ తర్వాత ఏం జరిగింది? ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ ఘటనను సమర్థించే వైఖరిని కొనసాగించారు, దేశ ప్రధాని దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కేంద్ర హోంమంత్రి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఎటువంటి చర్యలు తీసుకోనప్పుడు, ఈ శుద్ధీకరణ కాండకు ప్రధానమంత్రి, హోంమంత్రి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మౌన మద్దతు ఉందని స్పష్టమవుతోంది.

ప్రశ్న: మల్లికార్జున ఖర్గే దేశంలోని అత్యంత పురాతన జాతీయ పార్టీకి ఎన్నికైన అధ్యక్షుడు. ఈ ఘటనను మీరు కేవలం ఒక నాయకుడి అవమానంగా చూస్తున్నారా లేదా సమస్త బహుజన సమాజం ఆత్మగౌరవంపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నారా?

జవాబు: ఇది మల్లికార్జున ఖర్గేపై వ్యక్తిగత దాడి కాదు. ఆయనపై ఎలాంటి భౌతిక దాడి జరగలేదు, కానీ ఇది వారి ద్వారా దేశంలోని సమస్త దళిత, ఆదివాసీ సమాజానికి తగిలిన మానసిక దెబ్బ. అంతేకాకుండా ఇది కాంగ్రెస్ పార్టీపై కూడా జరిగిన దాడి, ఎందుకంటే ఆయన పార్టీకి ఎన్నికైన జాతీయ అధ్యక్షుడు. రాజ్యాంగానికి విరుద్ధంగా తమ ఇష్టానుసారం కాంగ్రెస్‌ను, ఎస్సీ-ఎస్టీ వర్గాలను టార్గెట్ చేయగలమని వారు ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.

ప్రశ్న: పార్లమెంట్‌లో 'నారీ శక్తి వందన అధినియం' (మహిళా రిజర్వేషన్) ఆమోదం పొందింది, కానీ దాన్ని రాబోయే జనాభా లెక్కలు, పరిసీమన్‌తో ముడిపెట్టారు. దీన్ని తక్షణమే, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ కోటాతో అమలు చేయడానికి కాంగ్రెస్ ఏం చేస్తోంది?

జవాబు: మహిళా రిజర్వేషన్లను తక్షణ ప్రభావంతో అమలు చేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ వైఖరి. వాస్తవానికి ఈ బిల్లును మొదట కాంగ్రెస్ హయాంలోనే రాజ్యసభలో ఆమోదింపజేశారు. ఇది వెంటనే పూర్తిస్థాయి చట్టంగా మారి అమలు కావాలని మేము కోరుకుంటున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం కావాలనే మహిళా రిజర్వేషన్లను పరిసీమన్ ప్రక్రియతో ముడిపెట్టి సంక్లిష్టం చేసింది. ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే, మహిళా రిజర్వేషన్లను పరిసీమన్ నుండి వేరు చేసి తక్షణమే అమలు చేయాలి, మేము దానికి శతశాతం మద్దతు ఇస్తాము. ఈ రిజర్వేషన్ల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల (ఓబీసీ) మహిళలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం తగిన వాటా తప్పనిసరిగా దక్కాలనేది మా స్పష్టమైన డిమాండ్.

ప్రశ్న: దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయి, ఉత్తర భారతదేశం ఆధిపత్యం పెరుగుతుందనే తీవ్ర ఆందోళనలు పరిసీమన్ కమిషన్ (నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి చెందిన ఎంపీగా మీ గణాంకాలు, వైఖరి ఏమిటి?

జవాబు: నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళన అత్యంత గంభీరమైనది, వాస్తవమైనది. భారత ప్రభుత్వ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాలు పూర్తి నిబద్ధతతో అమలు చేశాయి, ఫలితంగా అక్కడ జనాభా వృద్ధి రేటు నియంత్రణలోకి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేవలం జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పరిసీమన్ చేపట్టినా లేదా ప్రతి రాష్ట్రంలో సీట్లను 50 శాతం పెంచాలని చూసినా, అది దక్షిణాది రాష్ట్రాలకు జరిగే ఘోరమైన అన్యాయం అవుతుంది.

దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోండి: నేడు కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉంటే, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు ఉన్నాయి. అంటే రెండింటి మధ్య 60 సీట్ల తేడా ఉంది. ఒకవేళ రెండు రాష్ట్రాల్లోనూ సీట్లను 50 శాతం పెంచితే, కేరళలో 20 నుంచి 30కి పెరుగుతాయి, అదే ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి పెరుగుతాయి. అప్పుడు ఆ తేడా 60 నుండి నేరుగా 90 సీట్లకు చేరుకుంటుంది. ఇదేవిధంగా తెలంగాణ లేదా తమిళనాడుతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల మధ్య సీట్ల వ్యత్యాసం మరింత భారీగా పెరుగుతుంది. ఉత్తర భారతంలో ఇన్ని సీట్లు పెరిగితే దేశ ప్రధాని ఎంపికలో దక్షిణాదికి ఎలాంటి నిర్ణయాత్మక పాత్ర కూడా మిగలదు. అధికారంలో దక్షిణాదిపై ఎలాంటి ఆధారపడే పరిస్థితి లేనప్పుడు, ప్రభుత్వాలు ఇక్కడి అభివృద్ధిని బడ్జెట్‌ను పట్టించుకోవు, ఇక్కడి ప్రయోజనాలను ఆశించవు. పరిసీమన్ జరిగినా సరే, రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యాపరమైన వ్యత్యాసం అలాగే ఉండాలి తప్ప అసమతుల్యత ఏర్పడకూడదని మా స్పష్టమైన అభిప్రాయం.

ప్రశ్న: నియోజకవర్గాల పునర్విభజన కు ముందు ఆర్థిక, పార్లమెంటరీ సమతుల్యతకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలనే అంశంపై పార్లమెంటు లోపలా బయటా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకతాటిపై నిలుస్తాయా?

జవాబు: ఖచ్చితంగా. మేమందరం ఏకమై ప్రజాస్వామ్య ఆర్థిక వికేంద్రీకరణ, బడ్జెట్ సమాన పంపిణీ, పౌరులందరికీ సమాన హక్కుల హామీని డిమాండ్ చేస్తాము. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో అసమతుల్యత సృష్టించనివ్వబోం. జాతీయ విధానాన్ని పాటిస్తూ జనాభాను నియంత్రించుకున్న రాష్ట్రాలు, పార్లమెంట్‌లో తమ గొంతును కోల్పోవడం ద్వారా శిక్షను అనుభవించకూడదు.

ప్రశ్న: వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి కానీ అధికారికంగా సమావేశాల ముగింపు కాలేదు. ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వివాదాస్పద బిల్లులు తెస్తుందనే అనుమానం విపక్షానికి ఉందా?

జవాబు: ప్రత్యేక సమావేశాలు నిర్వహించే చట్టపరమైన అధికారం ప్రభుత్వానికి ఉంది, వారు అలా చేయవచ్చు. కానీ జనాభా విధానాలను కఠినంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు లేదా చిన్న రాష్ట్రాలకు ప్రభుత్వం అన్యాయం చేయకూడదనేదే మా ప్రధాన ఆందోళన. ఏ విధమైన ఊహించని చట్టపరమైన చర్యలనైనా పార్లమెంటులోనూ, ప్రజాస్వామ్య వేదికలపై గట్టిగా ఎదుర్కొంటాము.

ప్రశ్న: 'ఒక దేశం, ఒక ఎన్నికలు' విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పార్లమెంట్‌లో దీన్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ ఎలాంటి సన్నాహాలు చేస్తోంది?

జవాబు: 'ఒక దేశం, ఒక ఎన్నికలు' ఆలోచనను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. భారతదేశం విశాలమైన, బహుళ-రాష్ట్రాల సమాఖ్య వ్యవస్థ. ఎలాంటి ప్రజాస్వామ్య సమాఖ్య నిర్మాణంలోనైనా వివిధ రాజకీయ పరిస్థితుల కారణంగా వేర్వేరు సమయాల్లో రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి వస్తుంది. ఎక్కడైనా ప్రభుత్వం పడిపోవచ్చు లేదా కేంద్ర ప్రభుత్వమే మధ్యలో పడిపోవచ్చు. 1996, 1998లో కేంద్ర ప్రభుత్వం పడిపోయినప్పుడు కేవలం లోక్‌సభకు మాత్రమే ఎన్నికలు జరిపారు, రాష్ట్ర శాసనసభలను బలవంతంగా రద్దు చేయలేదు. మన దేశం నియంతృత్వంతో కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. ఏదో ఒక నిబంధనను రుద్ది దేశ సమాఖ్య వ్యవస్థను నాశనం చేయలేరు. పార్లమెంటు లోపలా, బయటా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాము.

ప్రశ్న: ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై మీరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీని ద్వారా కావాలనే అట్టడుగు వర్గాలను ఓటు హక్కుకు దూరం చేస్తున్నారనే అనుమానం విపక్షానికి ఉందా?

జవాబు: ఇది అత్యంత గంభీరమైన అంశం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో దీన్ని బలంగా లేవనెత్తారు. సమావేశాల సమయంలోనూ ప్రధాని లేదా హోంమంత్రి ఎస్ఐఆర్ ప్రక్రియపై పార్లమెంట్‌లో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశాము, కానీ ప్రభుత్వం చర్చ నుంచి పారిపోయింది. ఇప్పుడు మీడియాలో వస్తున్న వివరాల ప్రకారం, ఎన్నికల సంఘం లోపల ప్రధాన ఎన్నిక తోటి కమిషనర్ల సమ్మతి లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణయాలు సర్వసమ్మతితో లేదా కనీసం మూడింట రెండు వంతుల మెజారిటీతో జరగాలి, కానీ ఇక్కడ ఇద్దరు కమిషనర్ల అసమ్మతి ఉన్నప్పటికీ నిర్ణయాలను రుద్దారు.

ప్రశ్న: రాహుల్ గాంధీ దేశవ్యాప్త కుల గణన, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర వైఖరి నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తున్నాయి?

జవాబు: ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు మేము రాజకీయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా దీనికోసం పోరాడుతూనే ఉంటాము. రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో కుల గణన, రిజర్వేషన్ల 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ చారిత్రక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి, పార్లమెంటులో చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం అది కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. సాధారణ జనాభా లెక్కలతో కలిపి చేస్తామని కేంద్రం చెబుతోంది కానీ, వారి పనితీరులో స్పష్టత లేదు. వెనుకబడిన వర్గాలలో ఎవర్నీ అత్యంత వెనుకబడినవారు, ఎవరికి ఉపాధి దక్కింది, ఎవరికి దక్కలేదు, రాజకీయ ప్రాతినిధ్యంలో ఎక్కడ ఉన్నారు అనే విషయాలను గుర్తించనంతవరకు అది కోర్టులో నిలబడదు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande