వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సునీల్ యాదవ్ వాంగ్మూలంపై స్పందించాలని వైఎస్ జగన్ను డిమాండ్ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సునీల్ యాదవ్ వాంగ్మూలంపై స్పందించాలని వైఎస్ జగన్ను డిమాండ్ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: సునీల్ యాదవ్ వాంగ్మూలంపై స్పందించాలని వైఎస్ జగన్ను డిమాండ్ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు


హైదరాబాద్, 30 సెప్టెంబర్ (హి.స.)

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ వెల్లడించిన వాంగ్మూలంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడంపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేకా హత్య ద్వారా అంతిమంగా లబ్ధి పొందింది జగన్, ఆయన కుటుంబ సభ్యులేనని సునీల్ యాదవ్ స్పష్టంగా చెప్పినట్లు నిమ్మల గుర్తుచేశారు. కోర్టులో తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ పేర్కొన్నప్పటికీ, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. కేవలం తనను కాకుండా అసలు లబ్ధిదారులైన జగన్, అవినాష్‌రెడ్డి కుటుంబ సభ్యులను విచారిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిందితులు చెబుతున్నారని తెలిపారు.

ఈ హత్య కేసుతో ప్రమేయం ఉన్న పలువురు కీలక వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతి చెందడంపై మంత్రి తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. కసనూరు శ్రీనివాస్‌రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధర్‌రెడ్డి, డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మెన్ రంగయ్య తదితరుల మరణాల వెనుక ఉన్న నిజాలు బయటకు రావాల్సి ఉందన్నారు. హత్య కోసం ఏకంగా రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారనే ప్రస్తావన తెచ్చిన మంత్రి, అంత భారీ మొత్తాన్ని సమకూర్చే ఆర్థిక సామర్థ్యం ఎర్ర గంగిరెడ్డికి గానీ, శివశంకర్‌రెడ్డికి గానీ లేదని, రాజకీయంగా లబ్ధి పొందిన జగన్ కుటుంబానికే ఆ శక్తి ఉందని ఆరోపించారు. ఈ సుపారీ లావాదేవీలకు సంబంధించి రూ.40 లక్షలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసిందని గుర్తుచేశారు.

హత్య జరిగిన రోజు తెల్లవారుజామునే వివేకానందరెడ్డి మరణించిన విషయం ముందే తెలిసినప్పటికీ, సాయంత్రం వరకు పులివెందులకు వెళ్లకుండా జగన్ హైదరాబాద్‌‌లోనే ఎందుకు కాలయాపన చేశారని నిమ్మల ప్రశ్నించారు. నాటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఘటనా స్థలంలో ఉన్న రక్తపు మరకలను తుడిచివేసి, దీన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా సాక్ష్యాలను పూర్తిగా తారుమారు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన జగన్, ఆ తర్వాత తానే ముఖ్యమంత్రి అయ్యాక ఆ విచారణను నీరుగూర్చేందుకు, అడ్డుకునేందుకు నానా తంటాలు పడ్డారని విమర్శించారు. దస్తగిరి, సునీల్ యాదవ్ వాంగ్మూలాలు, దర్యాప్తు సంస్థల నివేదికలు, గూగుల్ టేక్‌అవుట్ ఆధారాలు, ఈడీ అటాచ్‌మెంట్లు అన్నీ ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయని పేర్కొంటూ, నిందితులు నేరుగా ఆరోపణలు గుప్పిస్తున్నా వైఎస్ జగన్ మౌనం వీడకపోవడం ప్రజల్లో తీవ్ర అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఇప్పటికైనా వివేకా హత్య ఉదంతంపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande