
హైదరాబాద్, 04 సెప్టెంబర్ (హి.స.) కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేరుతో ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదలయింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జి.ఓ.ఎం.ఎస్.నం.128ను శాఖ జారీ చేసింది. ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. కొండా సురేఖ ఇకపై మంత్రిగా కొనసాగరని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు వివరించింది. తెలంగాణ గెజిట్ ప్రత్యేక సంచికలో ఈ నోటిఫికేషన్ ప్రచురించాలని స్పష్టం చేసింది.
కొండా సురేఖ జన్మదినం సందర్భంగా వరంగల్ జిల్లాలోని గీసుకొండలో ఆమె అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పరకాల అసెంబ్లీ స్థానం, సీఎం రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. అవి వైరల్ అయినాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీ స్పందించింది. కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సదరు కమిటీకి రెండు లేఖల ద్వారా కొండా సురేఖ వివరణ ఇచ్చింది.
ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ రూపొందించిన నివేదికను పార్టీ అధిష్ఠానానికి పీసీసీ చీఫ్ అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా కొండా సురేఖపై అధిష్ఠానం చర్యలు తీసుకుంది. దీంతో కొండా సురేఖను రేవంత్ రెడ్డి క్యాబినెట్ నుంచి తొలగించాలని నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్