విద్యార్థుల స్క్రీన్ టైమ్ తగ్గించేలా చూడండి: ప్రధాని నరేంద్ర మోడీ
విద్యార్థులలో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు
మోడీ


న్యూఢిల్లీ, 05 సెప్టెంబర్ (హి.స.)

విద్యార్థులలో పెరుగుతున్న స్క్రీన్ టైమ్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల స్క్రీన్ టైమ్ను తగ్గించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవానికి ఒక రోజు ముందు శుక్రవారం నాడు జాతీయ పురస్కారాలు పొందిన ఉపాధ్యాయులతో ప్రధాని ఢిల్లీలో సంభాషించారు. ఇందుకు సంబంధించిన వీడియోను శనివారం పీఎం తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఓ ఉపాధ్యాయుడితో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం స్క్రీన్ టైమ్ కూడా ఒక రకమైన వ్యసనంగా మారుతోందని పేర్కొన్నారు. పిల్లలకు క్రీడలపై ఆసక్తి పెంచితే ఈ వ్యసనం నుంచి క్రమంగా బయటపడే అవకాశం ఉంటుందని అందువల్ల వీడియో గేమ్స్ కాకుండా మైదానంలో ఆడే నిజమైన క్రీడలను పిల్లలు అలవాటు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

అలాగే విశ్వవిద్యాలయాలు, పెద్ద నగరాల్లో డ్రగ్స్ మహమ్మారి విస్తరిస్తున్న తీరుపై అప్రమత్తంగా ఉండాలని మోడీ సూచించారు. పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులను ఉపాధ్యాయులు నిరంతరం గమనించాలని కోరారు. విద్యార్థులు డ్రగ్స్కు బానిస కాకుండా ముందుగానే వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధ్యాయులు కేవలం సిలబసు, పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా పిల్లల నిజ జీవితాలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పిల్లల బాల్యాన్ని కోల్పోనివ్వకూడదుని మోడీ అన్నారు. బాల్యంలో ఉండాల్సిన ఆటలు, సృజనాత్మకత, ఉత్సాహం కొనసాగించేలా చూడటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande