
జమ్ము కశ్మీర్, 05 సెప్టెంబర్ (హి.స.)
జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం మధ్య కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ యాసిర్ హతమయ్యాడు. యూస్‌మార్గ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.
యూస్‌మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారంపై నిఘా వర్గాల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో దళాలు ప్రతిదాడి చేశాయి. ఈ కాల్పుల్లో యాసిర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
యాసిర్ గతంలో లష్కరే తోయిబాలోని సులేమాన్ మూసా గ్రూప్‌లో సభ్యుడిగా ఉండేవాడని, అయితే సుమారు ఏడాది క్రితం ఆ విభాగం నుంచి విడిపోయి సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. గత కొంతకాలంగా యూస్‌మార్గ్ పరిసర ప్రాంతాల్లో అతడి కదలికలపై నిఘా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
యాసిర్ మృతి నేపథ్యంలో అతడి నెట్‌వర్క్, లష్కరే సభ్యులతో ఉన్న సంబంధాలు, అలాగే ఇటీవల జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడుల్లో అతడి ప్రమేయంపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi