
ఢిల్లీ , 05 సెప్టెంబర్ (హి.స.)పదమూడేళ్ల క్రితం ఛత్తీస్గఢ్లోని బస్తర్లో
మావోయిస్టులు జరిపిన దాడిలో కాంగ్రెస్ నేతలు సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ పూర్తి చేసిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు.. పది మందిని దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరిచింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరందరికీ సెప్టెంబర్ 16న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. విచారణ సమయంలో దాదాపు 101 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు న్యాయస్థానం వెల్లడించింది. 2013లో కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీ నిర్వహించింది. ఆ సభను లక్ష్యంగా చేసుకొన్న మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఆ ఘటనలో కాంగ్రెస్ నేతలు, భద్రతా సిబ్బంది, సామాన్యులు సహా 29 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర అగ్ర నాయకత్వం తీవ్రంగా నష్టపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్