బెంగాల్ ప్రతిపక్ష నేత లైంగిక దాడి ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశం
బెంగాల్ ప్రతిపక్ష నేత లైంగిక దాడి ఆరోపణలపై విచారణకు కేంద్రం ఆదేశం
Amithsha


హైదరాబాద్, 05 సెప్టెంబర్ (హి.స.)

పశ్చిమ బెంగాల్‌ ప్రతిపక్ష నేత రిటబ్రత బెనర్జీపై గతంలో వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై విచారణ జరుపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. రిటబ్రత బెనర్జీ పెళ్లి పేరుతో తనను లొంగదీసుకుని లైంగిక దోపిడీకి పాల్పడినట్లు 30 ఏళ్ల మహిళ 2017లో ఆరోపించింది. ఆయనతో ఉన్న సన్నిహిత ఫోటోలను కూడా ఆమె పోస్ట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో పాటు నాటి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీకి ఆ పోస్ట్‌ను ట్యాగ్ చేసింది. బలుర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు కూడా నమోదైంది.మమతా బెనర్జీ వర్గానికి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ తాజాగా ఈ కేసును గుర్తుచేశారు.

వివాహం చేసుకుంటానని నమ్మించి ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడిన పాత ఆరోపణలకు సంబంధించి రిటబ్రతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ దీనిపై స్పందించి బెంగాల్‌ ప్రతిపక్ష నేత, టీఎంసీ అసమ్మతి నేత అయిన రిటబ్రత బెనర్జీపై, టీఎంసీ ఎమ్మెల్యే కునాల్ ఘోష్ చేసిన తీవ్రమైన లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలను పరిశీలించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది.

“ఆ మహిళ ఫిర్యాదుపై ఏం జరిగిందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. రిటబ్రత బెనర్జీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించదని నేను ఆశిస్తున్నా. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించే ఏ అధికారిపైనైనా సరే, నేను తగిన చర్యలు తీసుకుంటా” అని ఆయన ట్వీట్ చేశారు. రిటబ్రత ఇప్పుడు ఏదో ఒక సాకుతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకుల కాళ్లు నాకడానికి సిద్ధపడతారని ఆయన విమర్శించారు.

కాగా, తనపై వచ్చిన ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని రిటబ్రత బెనర్జీ అప్పట్లో ఆరోపించారు. సీపీఎం నుంచి బహిష్కరణకు గురైన ఆయనను బెంగాల్‌ సీఐడీ ఈ కేసుపై విచారించింది. 2018లో ఆయన టీఎంసీలో చేరడంతో ఆ కేసు సద్దుమణిగింది. అయితే ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన నేపథ్యంలో ఎమ్మెల్యేగా గెలిచిన రిటాబ్రత మరో 59 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మమతా వర్గం నుంచి నిరసనలు వ్యక్తమైనప్పటికీ, రిటాబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ స్పీకర్ గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande