
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
మండలంలోని కోమటికుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కాపురం పట్టణం నుంచి కారులో ఓ కుటుంబం కంభం వైపు వెళ్తోంది. అదే సమయంలో దేవరాజు గట్టు నుంచి కంభం వైపు వెళ్తున్న సిమెంట్ లారీ ముందు వెళ్తున్న కారును తప్పించబోయి వేగాన్ని అదుపు చేయలేక బోల్తా పడింది. అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై లారీ అడ్డంగా పడటంతో సిమెంట్ బస్తాలన్నీ రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకొని గాయపడిన వారిని మార్కాపురం సర్వజన వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ