
షాద్నగర్, 06 సెప్టెంబర్ (హి.స.)
పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు అందించి పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు.
అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇళ్లను అందించే దిశగా చర్యలు చేపడుతోందని అన్నారు.
రేషన్ కార్డుల కై ప్రజలు దళారులను ఆశ్రయించి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను అధికారులు పరిశీలన చేసి నిబంధనల ప్రకారం అర్హత ఉన్న వారికి కార్డులు మంజూరు చేస్తారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అర్హులైన లబ్ధిదారులకు చేరేలా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..