
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
ఓ మహిళను కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. నల్లపాడు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను సీఐ భాస్కర్ వెల్లడించారు.
ఆగస్టు 14న ఉదయం కన్నావారితోటకు చెందిన ఓ మహిళ గోరంట్ల అన్నపూర్ణనగర్లో నడిచి వెళ్తుండగా తాడికొండ మండలం తాతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కుక్కమళ్ల గణేష్ కారులో వచ్చి ఆమెను అడ్డగించి కత్తి చూపి వాహనంలో ఎక్కించాడు. అక్కడి నుంచి ఆమెను లాం సమీపంలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల వెనుక ఉన్న ప్లాట్స్లోకి తీసుకెళ్లాడు. కత్తితో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడటంతో పాటు వీడియోలు, ఫొటోలు తీశాడు. విషయం ఎవరికైనా చెప్తే.. వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మళ్లీ ఎప్పుడు పిలిచినా రావాలని.. లేదంటే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని హోసన్నా మందిరం సమీపంలో వదిలాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ