
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కల్యాణ్ విస్తృత స్థాయి కార్యచరణకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడానికి చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రత్యేకంగా రూ. 35 కోట్లు కేటాయించి, దాదాపు 370 గ్రామాల పరిధిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాల్లో పాడైన 340 ఫిల్టర్ బెడ్లు పునరుద్ధరించారు.
తద్వారా సుమారు 25 లక్షల మందికి పరిశుభ్రమైన తాగునీటి సరఫరా జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులతో గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ, సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు, ప్రకాశం, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లతో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల ద్వారా వచ్చే 30 ఏళ్లలో 1.21 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలు తీర్చనున్నారు. మరో పది మల్టీవిలేజ్ స్కీమ్ పథకాలకు రూ. 9,355 కోట్లు మంజూరు చేశారు.
అత్యంత తీవ్ర నీటి ఎద్దడి కలిగిన 3 వేల గ్రామాలను గుర్తించి, రూ. 1,814 కోట్లతో సింగిల్ విలేజ్ వాటర్ స్కీమ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటితో పాటు గత ప్రభుత్వం అరకొర పనులు చేసి వదిలివెళ్లిన పులివెందుల, డోన్, ఉద్దానం తదితర తాగునీటి పథకాల పనులు పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు పవన్ కల్యాణ్ చొరవతో 3,439 గ్రామీణ తాగునీటి పనుల క్రమబద్ధీకరణ, విస్తరణ నిమిత్తం రూ. 4,054 కోట్ల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ