
తిరుపతి, 06 సెప్టెంబర్ (హి.స.) వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేశామని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ తెలిపారు.
ఈ రోజు ఉదయం సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్యతో కలిసి ఆయన స్థానిక కాలంగి నది వద్ద ఉన్న వినాయక నిమజ్జన ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన వేడుకలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఏర్పాట్లపై అధికారులతో కూలంకషంగా చర్చించారు.
ఈ సందర్భంగా సీఐ మురళీకృష్ణ మాట్లాడుతూ, నది వద్ద భక్తుల రద్దీని నియంత్రించడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జన ఘాట్ల వద్ద తగినంత వెలుతురు కోసం ప్రత్యేక విద్యుత్ దీపాలు, రాత్రి సమయంలోనూ స్పష్టంగా కనిపించేలా బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రమాదకర ప్రాంతాల్లో భక్తులు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు, గజ ఈతగాళ్లు మరియు రక్షణ బృందాలను అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య మాట్లాడుతూ, నిమజ్జన ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పూజా సామాగ్రిని వేయడానికి ప్రత్యేక తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాల రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV