
అమరావతి, 06 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్రం లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వ్యవస్థ పని చేయాలని స్పష్టం చేశారు. శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్ర స్థాయి హైపవర్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్యారోగ్యం... తదితర అంశాలపై సీఎం కీలక సూచనలు చేశారు. ‘గుంటూరు, అనంతపురం, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల కేసులు ఎక్కువగా నమోదైన అంశంపై ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. కేసుల సంఖ్యతో పాటు వాటి స్వభావం, కారణాలు, పరిష్కారానికి పడుతున్న సమయం వంటి అంశాలను పరిశీలించాలి. జిల్లా స్థాయి సమావేశాల నిర్వహణలో అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం... జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ