
తెలంగాణ , 06 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్కో) కీలక చర్యలు చేపట్టింది. మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్లను (సీపీఓలు) ఆహ్వానిస్తూ టెండర్ల ప్రకటనను జారీ చేసింది. పెరుగుతున్న విద్యుత్తు వాహనాల మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ రంగం ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళిక చేసింది. దీర్ఘకాలికంగా, వాణిజ్యపరంగా నిలకడైన ఈవీ ఎకోసిస్టమ్ను అభివృద్ధి చేయడమే టీజీ రెడ్కో ముఖ్య లక్ష్యం అని రెడ్కో ఎండీ ముషారఫ్ ఫారూఖీ పేర్కొన్నారు. ఎంపికైన సీపీఓలు వీటి ఆపరేషన్, మెయింటెనెన్స్, అప్గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ బాధ్యతలను చేపడతారని, ప్రాజెక్టు కాంట్రాక్ట్ కాలం 10 సంవత్సరాలు ఉంటుందన్నారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 169 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని చూస్తున్నామని రెడ్కో ఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్