
ఆదోని, 06 సెప్టెంబర్ (హి.స.) పారిశుద్ధ్య కార్మికురాలిపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ షాకింగ్ సంఘటన కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
స్థానిక మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్న నరసమ్మ అనే మహిళపై ఇద్దరు గుర్తు తెలియని మహిళలు అతి కిరాతకంగా దాడి చేసినట్లు తెలుస్తుంది. బాధితురాలు తెల్లవారుజామున బస్టాండ్ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన దుండగులు తొలుత ఆమె కళ్ళల్లో కారం పొడి చల్లారు. అనంతరం నరసమ్మ తప్పించుకునే అవకాశం లేకుండా ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటల్లో చిక్కుకుని బాధితురాలు తీవ్ర ఆర్తనాదాలు చేయడంతో గమనించిన తోటి కార్మికులు, ప్రయాణికులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
తీవ్రంగా గాయపడిన నరసమ్మను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, శరీర భాగాలు తీవ్రంగా కాలిపోవడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం భర్తను కోల్పోయిన నరసమ్మ, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తూ కుటుంబ భారాన్ని మోస్తోంది. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో మహిళపై ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్టాండ్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV