న్యూఢిల్లీ, 20 నవంబర్ (హి.స.) భారతీయ రైల్వేశాఖ కొత్తగా మరో రూట్లో వందే భారత్ రైలును ప్రవేశపెట్టనున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైలు దేశవ్యాప్తంగా 50కిపైగా మార్గాల్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం ఈ కొత్త రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలోనే మరికొద్ది మార్గాల్లో రైల్వేశాఖ సెమీ హైస్పీడ్ రైళ్లకు శ్రీకారం చుట్టబోతున్నది. ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ (USBRL)లో కశ్మీర్ నుంచి న్యూఢిల్లీకి అనుసంధానించే వందే భారత్ రైలును వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ తెలిపారు. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన చీనాబ్ రైలు వంతెనగుండా వెళ్తుందని పేర్కొన్నారు.
272 కిలోమీటర్ల యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్ రైల్వే 255 కిలోమీటర్ల పూర్తయ్యింది. కత్రా, రిసియా మధ్య 17 కిలోమీటర్లు డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఈ ఏడాది చివరి వరకు ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించాల్సి ఉందని.. ఇప్పటికే సాంకేతిక బృందాలు తనిఖీ చేసి ప్రామాణికంగా ఉండేలా చూస్తున్నారన్నారు. ప్రధాని షెడ్యూల్ ప్రకారం.. జనవరిలో వందే భారత్ రైలు ప్రారంభోత్సవం ఉంటుందని రైల్వేమంత్రి రవ్నీత్ సింగ్ పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని పరిశీలించిన తర్వాతే ప్రారంభోత్సవం తేదీని నిర్ణయించన్నట్లు మంత్రి పేర్కొన్నారు. చలికాలంలో హైవేపై ట్రక్కులు, వాహనాల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు లోయలో ప్రజలకు ఎంతో ఊరట కలుగుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..