జైసల్మేర్:, 21 డిసెంబర్ (హి.స.)జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ (GST) తొలగింపు సహా పలు అంశాలే ఎజెండాగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం (GST Council meeting) శనివారం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala sitharaman) నేతృత్వంలో 55వ కౌన్సిల్ సమావేశానికి రాజస్థాన్‌లోని జైసల్మేర్ వేదికైంది. పలు వస్తువులపై రేట్ల హేతుబద్ధీకరణ, శ్లాబుల మార్పు వంటి అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. అయితే, జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తొలగింపు అంశాన్ని మండలి మరోసారి వాయిదా వేసింది. మరింత పరిశీలన అవసరం అని మండలి అభిప్రాయపడినట్లు తెలిసింది.
ఆరోగ్య బీమా, టర్మ్ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలని పాలసీదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించింది. జీఎస్టీ తొలగించేందుకు నిర్ణయించింది. టర్మ్ పాలసీలు సహా పెద్దలు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేసేందుకు మంత్రుల బృందం సుముఖత వ్యక్తం చేసింది. సాధారణ వ్యక్తులు తీసుకునే రూ.5 లక్షలలోపు ఆరోగ్య బీమా పాలసీలపైనా జీఎస్టీని మినహాయించాలని, రూ.5 లక్షలు దాటిన ఆరోగ్య బీమా పాలసీలకు ప్రస్తుత 18 శాతం జీఎస్టీని కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై ఆరంభంలోనే చర్చించిన కౌన్సిల్.. ఈ అంశాన్ని వాయిదా వేసింది. మరింత లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు మంత్రుల బృందానికి నేతృత్వం వహించిన బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరి తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల