హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)
దేశీయంగా వెలికి తీస్తున్నటువంటి ముడి చమురుపై.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వీటిపై విండ్‌ఫాల్ గెయిన్స్ టాక్స్‌ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని నెలల పాటు జరిగిన విస్తృత చర్చలు, సమాలోచనల అనంతరం.. క్రూడ్ ఉత్పత్తులతో పాటుగా.. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపైనా ఈ పన్ను తొలగించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఒక్క ప్రకటనతోనే.. దేశీయంగా దిగ్గజ చమురు కంపెనీలుగా ఉన్న ONGC, ఆయిల్ ఇండియా, నయారా, రిలయన్స్ వంటి సంస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వీటిపై భారీగా పన్ను భారం తగ్గనుండటంతో.. వాటి మార్జిన్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా దిగొస్తుండటంతోనే కేంద్రం విండ్‌ఫాల్ టాక్స్ తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఈ పన్ను రద్దు నోటిఫికేషన్‌ను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌదరీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.విండ్‌ఫాల్ టాక్స్ అనేది.. దేశీయంగా ముడి చమురును వెలికితీసి.. పెట్రోల్, డీజిల్ సహా ఇతర క్రూడ్ ప్రొడక్ట్స్ రూపంలో విదేశాలకు ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలపై విధించే పన్ను. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో.. చాలా ఆయిల్ కంపెనీలు.. ఇలా పెద్ద ఎత్తున ముడి చమురు వెలికితీసి.. దేశీయంగా విక్రయించకుండా విదేశాలకు భారీ ధరకు ఎగుమతి చేసి అసాధారణ లాభాలు ఆర్జించాయి. దీంతో వీటి లాభాలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో.. కేంద్రం 2022, జులై 1న మొదటిసారి విండ్‌ఫాల్ టాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..