హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) శ్రీమంతుల అడ్డాగా భారత్ మారిపోతున్నది. ప్రతియేటా దేశవ్యాప్తంగా బిలియనీర్లు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుత సంవత్సరానికిగాను భారత్లో 185 మంది ఆగర్భ శ్రీమంతులు ఉన్నట్లు యూబీఎస్ తన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే సంపన్నవర్గాలు 21 శాతం మంది పెరిగారని, వీరి మొత్తం సంపద 905.6 బిలియన్ డాలర్లు లేదా రూ.75.19 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నదని పేర్కొంది. నికరంగా వీరి సంపద 42 శాతం ఎగబాకిందని తెలిపింది.
ప్రపంచ దేశాల శ్రీమంతుల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని వెల్లడించింది. 835 మందితో అమెరికా తొలిస్థానంలో నిలువగా, ఆ తర్వాతి స్థానంలో చైనా 427 మంది ఉన్నట్లు యూబీఎస్ తన తాజా బిలియనీర్ల నివేదికలో తెలిపింది. ప్రస్తుత సంవత్సరంలో కొత్తగా 32 మంది బిలియనీర్ల జాబితాలోకి చేరారని
తెలిపింది. 2015 నుంచి శ్రీమంతుల సంఖ్య 123 శాతం చొప్పున పెరగడం విశేషం. కుటుంబ వ్యాపారాలు వారీ
సంపద పెరగడానికి కీలక పాత్ర పోషించిందని,ముఖ్యంగా భారత్లో ఇంచుమించు అన్ని వ్యాపారాల్లో
కుటుంబ బిజినెస్లు అధికంగా ఉన్నాయని వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..