విశాఖ పార్లమెంటు స్థానంలో 33 నామినేషన్లకు ఆమోదం
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్టణం పార్లమెంటు స్థ
విశాఖ పార్లమెంటు స్థానంలో 33 నామినేషన్లకు ఆమోదం


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా విశాఖపట్టణం పార్లమెంటు స్థానానికి దాఖలైన మొత్తం 39 నామినేషన్లలో 33 పత్రాలకు పార్లమెంటు నియోజకవర్గ ఆర్.వో., జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున ఆమోదం తెలిపారు. అర్హత లేని ఐదు నామినేషన్ పత్రాలను నిబంధనలను అనుసరించి తిరస్కరించారు. ఒక దానిపై విచారణకు ఆదేశించారు. పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ, పోలీసు పరిశీలకులు అమిత్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్.వో., కలెక్టర్ స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో శుక్రవారం నామినేషన్ల పరిశీలనా ప్రక్రియను నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ ప్రక్రియలో ఒక్కో నామినేషన పత్రాన్ని క్షుణ్నంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకున్నారు. అఫడివిట్ పత్రంలో సంతకం చేయని కారణంగా స్వతంత్ర అభ్యర్థి మెహబూబ్ సుభాన్ నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు ఆర్.వో. ప్రకటించారు. ఫార్మాట్ ప్రకారం దరఖాస్తు సమర్పించ లేనందున స్వతంత్ర అభ్యర్థి వియ్యపు గంగరాజు నామినేషన్, జై భీంరావు భారత్ పార్టీ అభ్యర్థిని నక్క నమ్మిగ్రేస్ నామినేషన్లను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తెదేపా, వైకాపా ప్రధాన అభ్యర్థులకు ప్రత్యామ్నాయంగా(Substituteగా) వేసిన మతుకుమిల్లి తేజశ్విని, బొత్స అనూషల నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు ఆర్.వో. స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి దేవర శంకర్ వేసిన నామినేషన్లలో ఫాం-ఎ, ఫాం-బి పత్రాలు సరిగ్గా లేని కారణంగా ప్రపోజల్స్ సంతకాలను పరిగణనలోకి తీసుకొని స్వతంత్ర అభ్యర్థులుగా గుర్తించి ఆర్.వో. ఆమోదం తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పట్టపగలు రాజా రమేష్ పత్రాల్లో ప్రపోజల్స్ సంతకాలన్నీ ఒకేలా ఉండటంతో ఆర్.వో. అభ్యంతరం వ్యక్తం చేసి సంబంధిత అభ్యర్థిని వివరణ కోరారు. సంతృప్తి చెందని ఆర్.వో. సంబంధిత సంతకాల ధృవీకరణపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande