ములుగు, 27 సెప్టెంబర్ (హి.స.)
ములుగు జిల్లా తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్ దామెరవాయి అటవీ ప్రాంతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై స్మగ్లర్లు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గురువారం రాత్రి 11:30 ప్రాంతంలో తాడ్వాయి ఫారెస్ట్ రేంజ్లో దామెరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా భూమిని చదును చేస్తూ, చెట్లను నరికి, మెట్లను పేరికి వేస్తున్న జెసిబీని రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న ఎఫ్ ఎస్ ఓ వినోద్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర, సుమన్ల టీమ్ జెసిబి చేస్తున్న పనులను అడ్డుకొని, స్వాధీన పరచుకొని తాడ్వాయి అటవీ కార్యాలయమునకు తరలించు చుండగా తాడ్వాయి సమీపంలో జెసిబి ఓనర్ గంట సూరజ్ రెడ్డి (గున్నా), మరో ఇద్దరితో కలిసి అటవీ అధికారులపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడి చేశారు.
ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారుల జీప్ వాహన లైట్స్ను ధ్వంసం చేసి జెసిబీని తీసుకొని వెళ్ళగా ఈ దాడిలో ఎఫ్ ఎస్ ఓ వినోద్ తలకు మూడు చోట్ల తీవ్ర గాయాలై రక్తస్రావం జరగగా, చేతి వేళ్ళు చాలా చోట్ల విరిగినట్టు వైద్యులు తెలిపారు. శరత్ చంద్రకు తీవ్ర గాయాలవగా మెరుగైన చికిత్స కోసం వరంగల్లోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. గురువారం రాత్రి సమయంలో తాడ్వాయి అటవీ శాఖ పరిధిలో ఫారెస్ట్ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడికి పాల్పడ్డ దుండగులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని, ఫారెస్ట్ ఆఫీసర్ల పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ములుగు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్