హోసపేట , 24 జనవరి (హి.స.): కర్ణాటక రాష్ట్రంలోని విజయనగరలోని ఓ సహకార బ్యాంకులో సైబర్ నేరగాళ్లు రూ.2.34 కోట్లు దోచుకున్నారు. కాగా, 2025 జనవరి 10వ తేదీ నుంచి విజయనగరం, బళ్లారి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బళ్లారి జిల్లా సహకార కేంద్ర (బీడీసీసీ) బ్యాంకుకు చెందిన కస్టమర్ల ఖాతాలకు ఆన్‌లైన్ లో బదిలీలు జమ కావడం లేదని పలు శాఖలు నివేదించడంతో.. జనవరి 13వ తేదీన ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే, 10వ తేదీన బీడీసీసీ బ్యాంక్ నుంచి ఐడీబీఐ బ్యాంక్‌కి సాధారణ నిధుల బదిలీ సమయంలో హ్యాకర్లు ఎక్స్ఎంఎల్ ఫైల్‌లలో ఖాతా నంబర్‌లు, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లను మార్చగలిగారని ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, కస్టమర్ల పేర్లు మార్చకుండానే.. ఉత్తర భారత్ లోని పలు రాష్ట్రాల్లోని 25 వేర్వేరు ఖాతాలకు నిధులు జమ చేయబడ్డాయి.
ఇక, రూ. 5 లక్షలకుపైగా లావాదేవీలు ఇతర ఖాతాలకు మాయమైనట్లు బ్యాంకు విచారణలో తేలింది. దీంతో బ్యాంక్ సిబ్బంది వెంటనే దాని ఆర్టీజీఎస్/ ఎన్ఈఎఫ్టీ సేవలను నిలిపివేసి.. హోసపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసును బళ్లారి సైబర్ ఎకనామిక్ నార్కోటిక్స్ పీఎస్ కు బదిలీ చేయగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, భారత్ న్యాయ్ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లావాదేవీల కోసం ఉపయోగించిన కంప్యూటర్ యొక్క వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల