ముంబై, 24 జనవరి (హి.స.) మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లాలోని జవహర్ నగర్ లో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ రోజు (జనవరి 24) భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. నేటి ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా కలెక్టర్ సంజయ్ కోల్తే పేర్కొన్నారు.
అయితే, పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కూలిపోగా.. ఈ శబ్దం దాదాపు 5 కిలో మీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకోగా.. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉండగా.. వీరిలో ఇద్దరిని రెస్క్యూ టీమ్ కాపాడినట్లు తెలుస్తుంది. అయినా, ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. ఇక, గాయపడిన వారిని అంబులెన్స్ ల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల