
వాషింగ్టన్, 24 అక్టోబర్ (హి.స.)అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం ఆసియాలో కీలక పర్యటన చేపట్టనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఈ పర్యటన సాగనుంది. ఇందులో భాగంగా దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ట్రంప్ జరపనున్న సమావేశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల 30న ఈ కీలక భేటీ జరగనుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు.
శుక్రవారం వాషింగ్టన్ నుంచి బయలుదేరనున్న ట్రంప్, ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) సదస్సులో పాల్గొంటారు. గతంలో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జిన్‌పింగ్‌తో సమావేశాన్ని రద్దు చేసుకుంటానని హెచ్చరించిన ట్రంప్, తాజాగా అన్ని విషయాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఆశిస్తున్నట్లు బుధవారం వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల చైనా రేర్ ఎర్త్ లోహాలపై ఆంక్షలు విధించడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీ ఫలితంపై ప్రపంచ మార్కెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ మొదట మలేషియా చేరుకొని ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ASEAN) సదస్సులో పాల్గొంటారు. అక్కడ థాయ్‌లాండ్, కంబోడియా మధ్య చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకాలను పర్యవేక్షించనున్నారు. ఈ శాంతి చర్చల సానుకూల ఫలితాలను అధ్యక్షుడు ట్రంప్ చూడాలని ఆసక్తిగా ఉన్నారు అని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు. అనంతరం జపాన్‌లో పర్యటించి, ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా ఇటీవల నియమితులైన సనాయ్ తకైచీతో సమావేశమవుతారు.
దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటన మరింత కీలకం కానుంది. అక్కడి అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో భేటీ అవ్వడంతో పాటు, వ్యాపారవేత్తలతోనూ సమావేశమవుతారు. మరోవైపు ట్రంప్ పర్యటనకు కొద్ది రోజుల ముందే ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఉద్రిక్తతలను పెంచింది. దీంతో సైనిక రహిత జోన్ (డీఎంజెడ్)లో పర్యటనలను దక్షిణ కొరియా నిలిపివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV