లండన్, 28 మార్చి (హి.స.) బ్రిటన్ రాజు చార్లెస్-3 (King Charles) మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ఆయన క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే, ఆ చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయన లండన్‌లోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్ హామ్ ప్యాలెస్ వెల్లడించింది. మరోవైపు కింగ్ చార్లెస్ ఆసుపత్రిలో చేరడంతో అధికారిక కార్యక్రమాలన్నీ వాయిదా వేసినట్లు పేర్కొంది.
కాగా, 76 ఏండ్ల చార్లెస్ -3 క్యాన్సర్ బారిన పడినట్లు గతేడాది ఫిబ్రవరిలో నిర్ధరణ అయ్యింది. ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వైద్య పరీక్షల్లో వ్యాధి బయటపడింది. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడించలేదు.
ఇటీవలే బెంగళూరుకు వచ్చి కూడా వైద్యం చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ చికిత్స కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. 76 ఏండ్ల చార్లెస్-3 తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022, సెప్టెంబర్ 8న రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2023, మే 6న పట్టాభిషేకం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి