డిల్లీ, 3 జూలై (హి.స.)పాకిస్థాన్‌కు చెందిన పలు యూట్యూబ్ ఛానళ్లు, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై భారత్‌లో మరోసారి నిషేధం పడింది. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత ఈ అకౌంట్లను నిలిపివేయగా.. బుధవారం ఆ ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో యూట్యూబ్‌లో పలువురు పాక్ సెలబ్రిటీల (Pakistani celebrities) యూట్యూబ్ ఛానళ్లు దర్శనమిచ్చాయి. ఇన్‌స్టాలోనూ పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వారిపై నిషేధాన్ని కొనసాగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. దీంతో పాక్ సెలబ్రిటీల ఖాతాలను భారత్‌లో మళ్లీ బ్లాక్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు వీరి ఖాతాలను గురువారం ఉదయం నుంచి నిలిపివేసినట్లు సమాచారం. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల (Ban on Youtube Channels) ప్రసారాలు, సామాజిక మాధ్యమ ఖాతాలను భారత్‌లో నిలిపివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పాక్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మీడియాకు చెందిన పలు ఛానళ్లపై వేటు పడింది. పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, బాసిత్ అలీ, షాహిద్ అఫ్రిది ఛానళ్లు కూడా అందులో ఉన్నాయి. ఆ దేశ రక్షణ మంత్రి ఖాతాలను, ప్రధాని యూట్యూబ్ ఛానల్‌నూ బ్లాక్ చేశారు. పాక్ క్రికెటర్లు, నటీనటుల, అథ్లెట్ల ఖాతాలను కూడా నిలిపివేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు