ముంబై, 12 ఆగస్టు (హి.స.)
'సలాకార్': 'ది లెజెండ్ ఆఫ్ యాన్ ఎక్స్ టార్డినరీ ఇండియన్ స్పై' అనేది ఉప శీర్షిక. శ్రీనివాస్ అబ్రోల్ అందించిన కథతో ఈ సిరీస్ రూపొందింది. ఫరూక్ కబీర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో నవీన్ కస్తూరియా .. మౌనీ రాయ్ .. ముఖేశ్ రిషి .. సూర్యశర్మ ప్రధానమైన పాత్రలను పోషించారు. 5 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 8వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. బెంగాలీ .. మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది.
కథ: పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బ్రిగేడియర్ అస్రార్ ఖాన్ ( సూర్య శర్మ) ఒక ఫైల్ కోసం అన్వేషిస్తూ ఉంటాడు. పాకిస్థాన్ లో అక్రమంగా అణుబాంబులు తయారు చేయడానికి అవసరమైన ప్రాజెక్టు తాలూకు ఫైల్ అది. అణుబాంబు తయారీ సక్సెస్ అయితే, దానిని భారత్ పై ప్రయోగించాలనే ఆలోచనలో అతను ఉంటాడు. తన తాత జియా ఉల్లా (ముఖేశ్ రిషి) కలను నిజం చేయడమే తన ముందున్న లక్ష్యం. 1978 నాటి ఆ ప్రాజెక్టు ఫైల్ అస్రార్ ఖాన్ చేతికి చిక్కుతుంది.
ఈ విషయానికి సంబంధించిన సమాచారం ఢిల్లీలోని 'రా' ఆఫీస్ కి చేరిపోతుంది. దాంతో వాళ్లు సీక్రెట్ ఏజెంటుగా సృష్టి చతుర్వేది (మౌనీ రాయ్)ను రంగంలోకి దింపుతారు. అస్రార్ ఖాన్ సంపాదించిన 1978 నాటి ఆ ఫైల్లో ఏవుంది? అణుబాంబులను ఎక్కడ తయారు చేస్తున్నారు? అందుకు అవసరమైన ఫండ్ ఎక్కడి నుంచి అందుతుంది? పాకిస్థాన్ పూర్తి ప్లాన్ ఏమిటి? తెలుసుకోమని చెప్పి పంపిస్తారు.
1978లో ఏం జరిగింది? జనరల్ జియా ఉల్లా ఎలాంటి పధక రచన చేశాడు? అప్పట్లో ఆయనను ఎదుర్కొన్నది ఎవరు? అస్రార్ ఖాన్ మాస్టర్ ప్లాన్ తెలుసుకోవడానికి 'రా' సభ్యులు 'సృష్టి చతుర్వేది'నే ఎందుకు పంపించారు? అణుబాంబును సిద్ధం చేయాలనే అస్రార్ ఖాన్ కోరిక నెరవేరుతుందా? అతని ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి సృష్టి చేసే ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఇండియా .. పాకిస్థాన్ నేపథ్యంలో సాగే స్పై యాక్షన్ థ్రిల్లర్ కంటెంట్ తో చాలా సినిమాలు .. సిరీస్ లు గతంలో వచ్చాయి. అదే తరహాలో రూపొందిన సిరీస్ ఇది. కాకపోతే యాక్షన్ పాళ్లు తక్కువ .. వ్యూహాలతో కూడిన డ్రామా పార్టు ఎక్కువగా కనిపిస్తుంది అంతే. ఈ కథ ప్రస్తుతం కాలంతో ముడిపడే సాగుతుంది. ప్రస్తుత కథ కంటే కూడా 1978లోని కథనే తెరపై ఎక్కువ శాతం చూస్తాము. 1978నాటి వాతావరణాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది.
కథ ప్రస్తుత కాలాన్ని టచ్ చేస్తూ 1978లోకి వెళ్లి, అక్కడే ఎక్కువగా కొనసాగుతూ ఉంటుంది. ఆ కాలంలో సాంకేతిక పరంగా ఉన్న సదుపాయాలు, సీక్రెట్ ఏజెంట్లు వేగంగా చొచ్చుకుపోవడానికి తగిన సాంకేతిక పరమైన అవకాశాలు చాలా తక్కువ. ఈ కారణంగా కథ నిదానంగా నడుస్తూ ఉంటుంది. దాంతో ఈ జోనర్లో మనకి పాత సినిమాలను చూస్తున్న ఫిలింగును కలిగిస్తుంది.
ఇక ప్రస్తుతం కాలానికి సంబంధించిన ఎపిసోడ్స్ లో, తనకి అప్పగించిన ఆపరేషన్ ను పూర్తిచేసి పాకిస్థాన్ నుంచి సృష్టి చతుర్వేది బయటపడే ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా అనిపిస్తుంది. కొన్ని అసాధ్యాలు .. తెరపై అవలీలగా జరిగిపోవడం సినిమాలలో .. సిరీస్ లలో కామన్ కాబట్టి వాటిని పట్టించుకోకూడదు. ఇంత చేసినా ఈ కథలో ఎక్కడా కొత్తదనం లేకపోవడమే ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది.
పనితీరు: ఇటు ఇండియా .. అటు పాకిస్థాన్ నేపథ్యంలో, 1978 - 2025 అనే రెండు టైమ్ లైన్లలో దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ఈ రెండు కాలాల్లోను ఈ కథాంశాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే ఇంతకు ముందు వచ్చిన కంటెంట్ కి భిన్నంగా ఈ సిరీస్ ను నడిపించలేకపోవడమే ఒక లోపంగా కనిపిస్తుంది. రొటీన్ గా తిరుగుతున్న పళ్ల చక్రాల క్రిందనే ఈ కథ కూడా పడిపోతుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా, తమ పాత్రలను సహజత్వానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకుని వెళ్లగలిగారు. కాకపోతే ఆయా పాత్రలకు అవసరమైన పవర్ అందలేదేమో అనిపిస్తుంది. ఇంకాస్త పవర్ఫుల్ గా ఆ పాత్రలను డిజైన్ చేసుంటే బాగుండేదనే భావన కలుగుతుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫరవాలేదనే కేటగిరీలోనే అవి కనిపిస్తాయి.
ముగింపు: స్పై థ్రిల్లర్ జోనర్లో తయారు చేసుకున్న ఈ కథ, అప్పుడప్పుడు మాత్రమే ప్రస్తుత కాలాన్ని టచ్ చేస్తూ, ఎక్కువ శాతం 1978లోనే కొనసాగుతుంది. ప్రస్తుత కాలానికంటే ఫ్లాష్ బ్యాక్ కి ప్రాధాన్యతను ఇవ్వడమే ఆడియన్స్ కి అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది. రొటీన్ కి భిన్నంగా ముందుకు వెళ్లలేకపోయిన ఈ సిరీస్, ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి