న్యూఢిల్లీ, 3 ఆగస్టు (హి.స.)జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద మతం క్రైస్తవ మతం. కానీ ప్రస్తుతం అది సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని క్రైస్తవ మతాన్ని అనుసరించేవారు దూరమవుతున్నారు. ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా నివేదికలో ఈ సమాచారం వెల్లడైంది. గత దశాబ్దంలో ప్రపంచంలోని మరో నాలుగు దేశాలు క్రైస్తవ దేశం హోదాను కోల్పోయాయని ప్యూ రీసెర్చ్ విశ్లేషణలో తేలింది. అంటే ఒకప్పుడు క్రైస్తవ దేశాలుగా ఉన్న ఈ నాలుగు దేశాల్లో క్రైస్తవ జనాభా తగ్గింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రపంచంలో క్రైస్తవ్యం తగ్గుతుంటే భారత్‌లో మాత్రం గణనీయమైన పెరుగుదల కనిపించింది.
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. 2010- 2020 మధ్య క్రైస్తవ జనాభా మైనారిటీగా మారిన దేశాలలో బ్రిటన్ కూడా ఉంది. ఒకప్పుడు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ రూపంలో క్రైస్తవ మతం జెండాను రెపరెపలాడించిన బ్రిటన్‌లో ఇప్పుడు క్రైస్తవ జనాభా 50 శాతం కంటే తక్కువకు తగ్గింది. ఇది కాకుండా.. ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలో కూడా క్రైస్తవ జనాభా మైనారిటీగా మారింది. దక్షిణ అమెరికా దేశమైన ఉరుగ్వే కూడా ఈ జాబితాలో చేరింది. రెండు అమెరికా ఖండాల్లోనూ క్రైస్తవులు మైనారిటీలుగా ఉన్న ఏకైక దేశం ఉరుగ్వే. ఉరుగ్వేలో కేవలం 44 శాతం మంది మాత్రమే క్రైస్తవ మతంలో ఉన్నారు. 52% జనాభా ఏ మతాన్ని నమ్మరు. ఈ దేశాలలో క్రైస్తవ జనాభా తగ్గడానికి కారణం ప్రజలు మత సంప్రదాయాలకు దూరంగా ఉండటం. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. లక్షలాది మంది క్రైస్తవ మతాన్ని విడిచిపెడుతున్నారు. అయితే, ఎక్కువ మంది వేరే మతంలోకి మారడం కంటే తమకు ఎలాంటి మతం లేదని స్పష్టం చేస్తున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ