చమోలి/న్యూఢిల్లీ,18,సెప్టెంబర్ (హి.స.) ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో పెను విపత్తు సంభవించింది. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న నందనగర్‌లో గురువారం తెల్లవారుజామున సంభవించిన క్లౌడ్ బరస్ట్ పలు ఇళ్లను ధ్వంసం చేసింది. ఐదుగురు అదృశ్యమయ్యారు. జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, నందనగర్‌లోని కుంత్రి వార్డులో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చమోలి జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
క్లౌడ్ బరస్త్ దరిమిలా ఆ ప్రాంతంలో భయాందోళనలు అలుముకున్నాయి. ఇళ్ల శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏడుగురు ఇళ్లలో ఉండగా, వారిలో ఇద్దరిని రెస్క్యూ సిబ్బంది సజీవంగా బయటకు తీసుకువచ్చారు. గల్లంతైన మరో ఐదుగురు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎస్‌డీఆర్ ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, వైద్య బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ