
న్యూఢిల్లీ, 14 అక్టోబర్ (హి.స.)
నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కీలక ముందడుగు వేసింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ ప్రత్యేక కోర్టులో సీబీఐ తాజా అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన శేషారావ్ బజరంగ్ సూర్యవంశీ పాత్ర పై సమగ్ర ఆధారాలతో కూడిన అభియోగపత్రాన్ని సిబిఐ కోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న సూర్యవంశీని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు, ప్రశ్నపత్రం లీకేజీ కుట్రలో ఆయన ప్రమేయం, దళారులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ జరిపిన అనంతరం ఈ అభియోగాలను నమోదు చేశారు. సీబీఐ దాఖలు చేసిన ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్పై వాదనలను అక్టోబర్ 22వ తేదీన వింటామని ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ ఇదివరకే 13 మంది నిందితులపై ప్రధాన ఛార్జ్ షీట్ను దాఖలు చేయగా, న్యాయస్థానం ఇప్పటికే దానిని పరిగణనలోకి తీసుకుంది. ప్రధాన నిందితుల విచారణ కొనసాగుతుండగానే.. కుట్రలో భాగస్వాములైన మరికొందరిపై సమాంతరంగా దర్యాప్తు కొనసాగిస్తూ సీబీఐ అదనపు ఆధారాలను సేకరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..