
హైదరాబాద్, 17 అక్టోబర్ (హి.స.) దసరా పండుగ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులు తమ స్వస్థలాల బాట పట్టారు. సొంత ఊర్లకు వెళ్తున్న జన రద్దీతో భాగ్యనగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్ బి నగర్ వంటి ప్రధాన బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
మరోవైపు లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్లు సైతం ప్రయాణికుల రద్దీని తలపిస్తున్నాయి. దసరా పండక్కి పట్నమంతా పల్లెకు కదిలింది. పండుగ సెలవుకు లాంగ్ వీకెండ్ తోడవ్వడంతో.. మూడ్రోజుల ముందే సొంతూళ్లకు బయల్దేరారు. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనులు చేసుకునేవారంతా పల్లెకు క్యూ కట్టడంతో.. ఎక్కడ చూసినా రద్దీ కనపడుతుంది.
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారితో పాటుగా.. రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుంచి మరోప్రాంతానికి వెళ్లేవారికోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. నేడు మరియు రేపు భారీగా ప్రయాణాలుంటాయని అంచనా వేసిన ఆర్టీసీ.. 7 వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇదిలా ఉండగా సొంతవాహనాలలో ఊర్లకు వెళ్తున్న వారి వల్ల హైదరాబాద్ - విజయవాడ హైవేపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. టోల్ గేట్ల వద్ద కార్లు, ఇతర వాహనాల క్యూ పెరుగుతుండటంతో.. ట్రాఫిక్ జామ్ లు చోటు చేసుకుంటున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు