
న్యూఢిల్లీ, 02 అక్టోబర్ (హి.స.)
గాంధీ జయంతి (157వ జయంతి) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతిపిత మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మహాత్మా గాంధీ బోధించిన శాంతి, అహింస సందేశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. 2047 నాటికి 'వికసిత భారత్' సాధనే లక్ష్యంగా దేశం ముందుకు వెళ్తోందని, ఇందులో భాగంగా అందరికీ సంక్షేమం, సమానత్వం దక్కేలా 'సర్వోదయ' ఆశయాలకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. శక్తివంతమైన, స్వావలంబన కలిగిన ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
మరోవైపు న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధిని సందర్శించి ప్రధాని మోదీ నివాళులర్పించారు. బాపూజీ ఆదర్శాలు, సత్యం, అహింస మార్గాలు ఎల్లప్పుడూ దేశ ప్రజలకు దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయని సోషల్ మీడియా వేదికగా గుర్తుచేశారు. అలాగే అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఇదే రోజు జన్మించిన మాజీ ప్రధాని లాల్ బహాదుర్ శాస్త్రి జయంతిని కూడా దేశవ్యాప్తంగా ఘనంగా స్మరించుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi