
హైదరాబాద్ , 02 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో రైల్వే ప్రయాణ భద్రతను పెంచేందుకు కవచ్ 4.0 వ్యవస్థను మరో 131 రూట్ కిలోమీటర్ల మార్గంలో ప్రారంభించారు. సికింద్రాబాద్ డివిజన్లోని పగిడిపల్లి నుంచి విష్ణుపురం జంక్షన్ వరకు ఉన్న మార్గంలో ఈ అధునాతన ఏటీపీ వ్యవస్థను కమిషన్ చేశారు.కవచ్ అనేది భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన స్వదేశీ అటోమెటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ. రైలు నిర్ణయించిన వేగ పరిమితిని మించి వెళ్తే లేదా లోకో పైలట్ అవసరమైన సమయంలో స్పందించకపోతే వ్యవస్థ ఆటోమేటిక్గా బ్రేకులు అమలు చేయడానికి రూపొందించబడింది.
కవచ్ 4.0లో గత వెర్షన్లతో పోలిస్తే అనేక సాంకేతిక మెరుగుదలలు ఉన్నాయి. రైలు ఉన్న స్థానాన్ని మరింత ఖచ్చితంగా గుర్తించడం, పెద్ద రైల్వే యార్డుల్లో సిగ్నల్ సమాచారాన్ని మెరుగ్గా అందించడం, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా స్టేషన్-టు-స్టేషన్ కమ్యూనికేషన్, ఇప్పటికే ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థలతో అనుసంధానం వంటి సదుపాయాలు ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వేలో కవచ్ 4.0 మొదటి దశగా సెప్టెంబర్ 23న మల్కాజిగిరి–కామారెడ్డి మధ్య 108 రూట్ కిలోమీటర్ల మార్గంలో ఈ వ్యవస్థను ప్రారంభించారు. ఇప్పుడు పగిడిపల్లి–విష్ణుపురం మార్గంలో మరో 131 కిలోమీటర్లకు విస్తరించడం వల్ల తెలంగాణలో ఈ భద్రతా వ్యవస్థ పరిధి మరింత పెరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్