
హైదరాబాద్ , 02 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో తక్కువ వర్షపాతం కారణంగా ఏర్పడుతున్న కరవు పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రంలో సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో, దాదాపు 235 మండలాల్లో కరవు తరహా పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిందని అధికారులు, మంత్రులు పేర్కొన్నారు. పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసేందుకు మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
ప్రభావిత మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించి, ఉపశమన చర్యలకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరనుంది.
ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి కరవు ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు తీసుకోనుంది. అనంతరం ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించి సమగ్ర కరవు నిర్వహణ ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ రంగంపైనే కాకుండా విద్యుత్ వినియోగంపైనా ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ సుమారు 15 వేల మెగావాట్లుగా ఉంటే, ఈ సీజన్లో అది 19,892 మెగావాట్లకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది ఇదే సమయంలో గరిష్ఠ డిమాండ్ 16,613 మెగావాట్లుగా ఉంది. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు కేబినెట్ నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్