అనంతపురం గ్రామీణ ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల ఘర్షణ
అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం గ్రామీణ ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగి, చివరకు ఇరువర్గాల మధ్య రాళ్లదాడికి దారితీసింది.
Police


అనంతపురం , 22 అక్టోబర్ (హి.స.)అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతపురం గ్రామీణ ఎంపీడీవో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం చెలరేగి, చివరకు ఇరువర్గాల మధ్య రాళ్లదాడికి దారితీసింది. ఈ ఘటనతో కార్యాలయం పరిసరాల్లో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది.

కోడిమి, ఇటుకలపల్లి ఎంపీటీసీ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగింది. తొలుత వాగ్వాదంగా ప్రారంభమైన వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి, పరస్పరం రాళ్లు విసురుకున్నారు.

నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అక్కడికి వచ్చిన అభ్యర్థులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సాధారణ కార్యకలాపాలకు సైతం అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande