
రాయపూర్ , 22 అక్టోబర్ (హి.స.)
దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 22, 23 తేదీలలో ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమె రాయ్‌పూర్, జగదల్పూర్ ప్రాంతాల్లో జరిగే పలు చారిత్రక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు (అక్టోబర్ 22) ఉదయం 11:15 గంటలకు రాయ్‌పూర్ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి, అక్కడి నుండి నేరుగా లోక్ భవన్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు పూజ్య మాతా హాసి దేవిజీ జ్ఞాపకార్థం రూ. 200 ప్రత్యేక స్మారక నాణేన్ని, పోస్టల్ స్టాంపును ఆమె విడుదల చేస్తారు.
అనంతరం సాయంత్రం 4:00 గంటలకు బుధాపారాలోని బలబీర్ సింగ్ జునేజా ఇండోర్ స్టేడియంలో నూవాఖాయ్ పర్వదినం సందర్భంగా నిర్వహించే సేవా సమ్మాన్ పర్వ్, యువ ప్రబోధన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వేడుకకు దాదాపు నాలుగు వేల మంది యువకులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమెన్ డేకా, సీఎం విష్ణుదేవ్ సాయ్, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, నగర ఎమ్మెల్యేలు ప్రధానంగా పాల్గొంటారు.
పర్యటనలో రెండవ రోజైన అక్టోబర్ 23న ఉదయం బస్తర్ (జగదల్పూర్) చేరుకునే రాష్ట్రపతి, తొలుత ఉదయం 11:00 గంటలకు బస్తర్ ఆరాధ్య దేవత మా దంతేశ్వరి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు సిరహాసార్ భవన్‌లో జరిగే ప్రపంచ ప్రసిద్ధ బస్తర్ దసరా ముఖ్య ఘట్టమైన సంప్రదాయ 'మురియా దర్బార్'లో భాగస్వామ్యులవుతారు. ఇక్కడ స్థానిక గిరిజా నాయకులు (మాంఝీ-చాల్కీ), ప్రజాప్రతినిధులతో ముఖాముఖి మాట్లాడతారు.
ఈ కార్యక్రమం బస్తర్ గిరిజన సంస్కృతికి జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తెస్తుందని భావిస్తున్నారు. దర్బార్ అనంతరం జగదల్పూర్ లాల్‌బాగ్ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తారు. స్థానిక గిరిజన కళా సంప్రదాయాలను తిలకిస్తారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాయ్‌పూర్, జగదల్పూర్ నగరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన ఛత్తీస్‌గఢ్, ముఖ్యంగా బస్తర్ ప్రాంత చారిత్రక వైభవాన్ని, గిరిజన అస్తిత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని యంత్రాంగం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi