
జగదల్‌పూర్:, 23 అక్టోబర్ (హి.స.)
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన బస్తర్ దసరా వేడుకలలో భాగంగా నిర్వహించిన చారిత్రాత్మక 'మురియా దర్బార్' కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూనే, తమ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకోవాలని ఆదివాసీ గిరిజన తెగలకు ఆమె పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉద్బోధించారు.
ఈ ప్రత్యేక వేడుకకు ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రామెన్ దేకా, ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సభను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడుతూ.. స్వయంగా గిరిజన మూలాలు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు ఆదివాసీల జీవన విధానంపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గిరిజన సమాజం ఎల్లప్పుడూ ప్రకృతితో మమేకమై, శాంతియుతంగా జీవిస్తూ, సంగీతం, నృత్యాల ద్వారా తమ ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని తరతరాలుగా పరిరక్షిస్తోందని కొనియాడారు.
వ్యక్తిగత వికాసానికి, సామాజిక అభ్యున్నతికి విద్యే ప్రాథమిక పునాది అని రాష్ట్రపతి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యావకాశాలను మెరుగుపరచడం ద్వారా సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యను పుణికిపుచ్చుకుంటూనే, తమ ప్రత్యేక గుర్తింపును, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత గిరిజన యువతపై ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi