
అమరావతి , 23 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు) స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మొత్తం 32,095 నామినేషన్లు నమోదయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ నామినేషన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 15,017 నామినేషన్లతో ముందంజలో ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 12,419 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారే అవకాశముంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ నుంచి 2,073 నామినేషన్లు నమోదయ్యాయి. భారతీయ జనతా పార్టీ తరఫున 562 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇక జాతీయ, వామపక్ష పార్టీల విషయానికొస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి 292 నామినేషన్లు, సీపీఐ నుంచి 311 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు అదనంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు వచ్చారు. ఇండిపెండెంట్లుగా మొత్తం 973 నామినేషన్లు నమోదయ్యాయి.
మొత్తం నామినేషన్ల సంఖ్యను పరిశీలిస్తే వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, నామినేషన్ల సంఖ్య ఒక్కటే ఎన్నికల ఫలితాలను నిర్ణయించదు. అభ్యర్థుల స్థానిక పలుకుబడి, ప్రజల మద్దతు, ప్రచార వ్యూహాలు, స్థానిక సమస్యలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక బరిలో మిగిలే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్