
ఆసిఫాబాద్:, 25 అక్టోబర్ (హి.స.)
ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక, నిజాం నవాబు రజాకార్ల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడు కుమ్రం భీమ్ 86వ వర్ధంతి వేడుకలకు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ సిద్ధమైంది. ఆశ్వీయుజ పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 26న (సోమవారం) నిర్వహించనున్న వర్ధంతి సభకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాట్లు పూర్తి చేసింది.
జోడేఘాట్లోని భీమ్ స్మారక స్తూపం, మ్యూజియం కాంప్లెక్స్ ప్రాంగణంలో సాంప్రదాయ ఆదివాసీ పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రానున్నట్లు సమాచారం ఉంది. ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అంతేకాకుండా రేపు కుమ్రంభీం వర్థంతి సందర్భంగా , జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరై భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు.
ఆదివాసీల ‘జల్-జంగల్-జమీన్’ నినాదం
జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) నినాదంతో గిరిజనుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసిన భీమ్ స్ఫూర్తిని స్మరించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు, అభిమానులు జోడేఘాట్‌కు తరలివచ్చే అవకాశం ఉంది. వచ్చిన భక్తులకు, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా, తాగునీరు, వైద్య సదుపాయాలను జిల్లా యంత్రాంగం కల్పించింది.
ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi