
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
తుపాను ప్రభావం నేపథ్యంలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ (ఎఫ్ఎంజీ) ఇంటర్న్‌షిప్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. విజయవాడలో అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేసింది.
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులు, వైద్య పట్టభద్రులు తమ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది. అయితే తుపాను కారణంగా వర్షాలు, ఈదురుగాలులు, రవాణా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండటంతో అభ్యర్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కౌన్సెలింగ్ వాయిదా విషయాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ ప్రకటించారు. నిర్ణీత తేదీల్లో విజయవాడకు రావాల్సిన అభ్యర్థులు కొత్త తేదీలపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు. వాయిదా పడిన కౌన్సెలింగ్‌ను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుని, కొత్త షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు తాజా సమాచారం కోసం ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారిక ప్రకటనలను గమనించాలని సూచించారు. కొత్త తేదీలు ప్రకటించిన తర్వాత కౌన్సెలింగ్‌కు సంబంధించిన తదుపరి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్