
అమరావతి , 27 అక్టోబర్ (హి.స.)
తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇవాళ, రేపు వివిధ మార్గాల్లో నడవాల్సిన రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది.
రద్దయిన రైళ్లలో రాజమహేంద్రవరం–విజయవాడ, విజయవాడ–మచిలీపట్నం, మచిలీపట్నం–గుడివాడ, కాకినాడ పోర్ట్–విశాఖపట్నం, పార్వతీపురం–విశాఖపట్నం మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. అలాగే విజయవాడ–నరసాపురం, నరసాపురం–విజయవాడ, విజయవాడ–కాకినాడ పోర్ట్, రాజమండ్రి–విశాఖపట్నం మార్గాల్లో ప్రయాణించే పలు రైళ్లను కూడా ఇవాళ రద్దు చేశారు.
రేపు విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–భీమవరం, భీమవరం–నిడదవోలు, కాకినాడ–విజయవాడ, నరసాపురం–నిడదవోలు, గుంటూరు–రేపల్లె, రేపల్లె–గుంటూరు, విజయవాడ–రాజమండ్రి తదితర మార్గాల్లోని రైళ్లు కూడా అందుబాటులో ఉండవు.
తుపాను కారణంగా ప్రయాణ ప్రణాళికలు మార్చుకోవాల్సి రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. రైలు ప్రయాణానికి బయలుదేరే ముందు తమ రైలు రద్దయిందా లేదా అనే విషయాన్ని అధికారిక రైల్వే సమాచార మార్గాల్లో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్